మధ్యవర్తి నియామకం వాయిదా

మధ్యవర్తి నియామకం వాయిదా

దిల్లీ: అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాద పరిష్కారానికి మధ్యవర్తి నియామక విషయాన్ని అత్యున్నత న్యాయ స్థానం బుధవారం వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేసింది. మధ్యవర్తి నియామకం గురించి రెండు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును వాయిదా వేసినట్లు ధర్మాసనం ప్రకటించింది. ‘ఇది కేవలం ఆస్తికి సంబంధించిన వ్యవహరం కాదు. మనసు, హృదయం, స్వస్థతకు సంబంధించినది. ఇది కేవలం భూ వివాదం మాత్రమే కాదు. రెండు మతాల విశ్వాసానికి, భావోద్వేగానికి సంబంధించిన అంశం. గతాన్ని మనం మార్చలేం. ఎవరు కూల్చారు. ఎవరు రాజు. ఆలయమా. మసీదా అన్నది ఇప్పుడు అప్రస్తుతం. ప్రస్తుత వివాదాన్ని మాత్రమే మేం పరిగణనలోకి తీసుకుంటాం. ఆ వివాదాన్ని పరిష్కరించాలని చూస్తాం. సమస్య పరిష్కారానికి ఒకరి కంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరం అని భావిస్తున్నాం’ అని జస్టిస్‌ బోబ్డే అన్నారు. మధ్యవర్తి త్వానికి ముస్లింలు సమ్మతించగా హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. ‘మధ్య వర్తిని నియమించడం మాకు అంగీకారమే. పరిష్కారమేదైనా అది రెండు వర్గాలను కలిపి ఉంచాలి’ అని ముస్లింల తరఫు న్యాయవాది రాజీవ్‌ ధవన్ న్యాయస్థానానికి విన్నవించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా మధ్యవర్తి నియామకాన్ని వ్యతిరేకించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదని అభిప్రాయ పడింది. ఒక వేళ మధ్యవర్తి నియామకం అనివార్యమని న్యాయస్థానం తీర్మానించినపుడు రెండు పక్షాలూ పక్షాలు మధ్య వర్తుల పేర్లు సూచించాలని జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ కోరారు. ఏమాత్రం అవకాశం ఉన్నా మధ్యవర్తిత్వం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఇటీవల సుప్రీం కోర్టు పేర్కొనటం ఇక్కడ ప్రస్థావనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos