హైదరాబాద్ : రాజకీయ కారణంతోనే తనపై దాడి జరిగిందని, మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కర్రలతో కొట్టారని అటవీ శాఖ రేంజ్ అధికారిణి అనిత వాపోయారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు, ఆయన అనుచరుల దాడిలో గాయపడిన ఆమె నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాలలో 20 హెక్టార్ల అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడానికి వీలుగా భూమిని చదును చేయించడానికి ట్రాక్టర్లతో వెళ్లిన తమపై స్థానికులను రెచ్చగొట్టి దాడి చేయించారని ఆరోపించారు. నాలుగు రోజుల కిందటే తాము గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి, దీని గురించి చెప్పామన్నారు. అప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. తాను డిశ్చార్జి అయ్యాక తన రక్షణ విషయంలో ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు. ఎంతో ఉత్సాహంతో తాను ఈ వృత్తిలోకి వచ్చానని, తనకు జరినట్లు ఇంకెవరికీ జరగరాదని అన్నారు.