పాట్న: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బంగాలోని మాల్దాలో బుధవారం మధ్యాహ్నం ఆహన వాహనంపై దాడి జరిగింది. హరిశ్చంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాంగంజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వాహనంపై రాళ్లు రువ్వడంతో వాహనం వెనుక అద్దం పగిలిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ చౌదరి తెలిపారు. గతంలో కూచ్ బిహార్ పట్టణంలో రాహుల్ గాంధీకి స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన పోస్టర్లు, బ్యానర్లు చింపేశారు. ఈ రోజు బెంగాల్, బీహార్ సరిహద్దులో దాడి జరిగింది. బెంగాల్లోని మాల్దాలో ఈ ఘటన చోటుచేసుకోగా గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో రాయి విసరడంతో కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో మాల్దాలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కాన్వాయ్ను కొందరు టార్గెట్ చేశారని అక్కడి నేతలు పేర్కొన్నారు. ఈ దాడి ఘటన వెనుక అధికార పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. రాహుల్ ‘న్యాయ యాత్ర’కు పదే పదే అడ్డంకులు జరుగుతున్న నేపథ్యంలో తగిన భద్రత కల్పించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ పంపారు. ఈ క్రమంలోనే మాల్దాలోకి ప్రవేశించిన తర్వాతే అయన భయాలు నిజమయ్యాయి. బెంగాల్-బీహార్ సరిహద్దుల్లో ఈ దాడికి పాల్పడింది ఎవరన్నదానిపై విచారణ జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రదీప్ భట్టాచార్య డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.