నాగోలు: ఏటీఎంలో నగదు జమ చేయాల్సినవాడే… తెలివిగా తస్కరించిన సంఘటనలో సదరు నిందితునితోపాటు అతడికి సహకరించిన ప్రేమికురాలు, మరో స్నేహితుడిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.40లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ నిందితుల వివరాలు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం నాగారంలోని కరూర్ వైశ్యాబ్యాంక్ ఏటీఎంలో తరచూ నగదు తక్కువగా ఉంటున్నట్లు బ్యాంకుకు చెందిన అధికారులకు అనుమానం కలిగి పరిశీలించగా రూ.47,37,700/- తక్కువగా వచ్చింది. కీసర పోలీసులు దర్యాప్తు చేసి సబ్ కాంట్రాక్టు తీసుకున్న వ్రైటర్ సేఫ్‌గార్డు సంస్థలో పనిచేసే సాయిరామ్ సాయికృష్ణ(26)ను నిందితుడుగా తేల్చారు. మేడ్చల్‌జిల్లా యాప్రాల్ సమీపంలోని కుమ్మరి బస్తీకి చెందిన సాయికృష్ణ.. తన దగ్గర ఉన్న తాళం సాయంతో ఆ మొత్తాన్నీ వెనక్కి తీసేవాడు. దాన్ని అమ్ముగూడలో ఉండే తన ప్రియురాలు పూజ(23)కు చెందిన అకౌంట్లలో జమ చేశాడు. మిగతా నగదును నేరెడ్‌మెట్ వాజ్‌పేయినగర్‌కు చెందిన తాటికొండ నాగరాజు అనే స్నేహితుని అకౌంట్‌లో జమచేశాడు. ఆ డబ్బుతో ఓ కారు కొన్నారు. సమావేశంలో జాయింట్ సీపీ సుధీర్‌బాబు, డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ శివకుమార్, సీఐ ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు.