వాషింగ్టన్: నకిలీ యూనివర్శిటీలో విద్యార్థులుగా చేరి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వందల మంది భారతీయులను అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో చాలా మంది తెలుగువారు కూడా ఉన్నారు. అంతేగాక.. వీరిని విద్యార్థులుగా చూపిస్తూ అమెరికాలో నివసించేందుకు సహకరిస్తున్న 8 మంది భారత సంతతికి చెందిన దళారీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. డెట్రాయిట్‌లో ఆరుగురిని, వర్జీనియా, ఫ్లోరిడాలో ఇద్దర్ని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో భరత్ కాకిరెడ్డి, సురేశ్ కందాల, ఫణిదీప్ కర్నాటి, ప్రేమ్ రాంపీసా, సంతోష్ శామా, అవినాష్ తక్కళ్లపల్లి, అశ్వంత్ నూనె, నవీన్ ప్రత్తిపాటి ఉన్నారు.
ఎలా బయటపడింది..
అమెరికాలో అక్రమ వలసదారులు పెరుగుతున్న నేపథ్యంలో వారి గుట్టును బయటపెట్టేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా డెట్రాయిట్‌లో ఫర్మింగ్టన్ యూనివర్శిటీ పేరుతో నకిలీ యూనివర్శిటీని ఏర్పాటుచేసింది. ఉన్నత విద్య పేరుతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని గుర్తించేందుకు అధికారులు ఈ ఎత్తుగడ వేశారు. దీంతో ఈ అక్రమ వలసదారుల వ్యవహారం బయటపడింది.
ఈ యూనివర్శిటీలో ప్రవేశాలు ప్రారంభించి 900 మందిని విద్యార్థులుగా చేర్చుకున్నారు. వీరిలో చాలా మంది భారత్ నుంచి వచ్చిన వారే. ఈ యూనివర్శిటీలో తరగతులు జరగవు. కేవలం వారి నుంచి డబ్బు తీసుకుని విద్యార్థి వీసాలు ఇస్తారు. ఇందుకోసం 8 మంది దళారులు పనిచేశారు. ఇలా నకిలీ పత్రాలతో స్టూడెంట్ వీసా సాధించిన వారంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు తేలింది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అరెస్టు చేశారు.
వందల మంది అరెస్టు..
గత రెండు రోజులుగా అధికారులు సోదాలు చేపట్టి ఈ నకిలీ యూనివర్శటీలో విద్యార్థులుగా చేరిన వందల మంది విదేశీయులను అరెస్టు చేశారు. ఓహైయో, టెక్సాస్, జార్జియా, మిస్సోరీ, న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సహకరించిన ఎనిమిది మంది భారతీయులను అరెస్టు చేసి డెట్రాయిట్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. అయితే మొత్తంగా ఎంతమందిని అరెస్టు చేశారన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కాగా అరెస్టయిన వారిలో కొందరు తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
కాగా.. ఇలా నకిలీ యూనివర్శిటీ ఏర్పాటుచేసి నకిలీ స్టూడెంట్ వీసా రాకెట్ గుట్టు విప్పిన ఘటనలు గతంలోనూ జరిగాయి. 2016లో న్యూజెర్సీలో ఇలాగే ఓ నకిలీ యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్లు తేలడంతో 21 మందిని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది.