అమరావతి : కడప జిల్లా పులివెందులలో జరిగిన వైఎస్. వివేకానంద రెడ్డి హత్యోదంతంపై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడవద్దని ఏపీ హైకోర్టు శుక్రవారం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు మీడియా ముందు కానీ, బహిరంగ సభల్లో కానీ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై మాట్లాడకూడదని హైకోర్టు ఆదేశించింది. దీనిపై మాట్లాడబోమని ఆయా పార్టీలు కోర్టుకు అంగీకార పత్రాన్ని రాసివ్వాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈ హత్యపై ప్రస్తుత సిట్ విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే, సిట్ అధికారులు మీడియా ముందు వివరాలు బహిర్గతం చేయరాదని స్పష్టంగా ఆదేశించింది.