ముమ్మాటికి ‘ప్రైవేటు’ద్రోహమే..

ముమ్మాటికి ‘ప్రైవేటు’ద్రోహమే..

వైరస్‌ రూపంలో మానవాళికే ముప్పుగా పరిణమించిన కరోనా శత్రువును ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కరోనాపై పోరాటాన్ని ప్రపంచ దేశాలన్నీ మూడో ప్రపంచ యుద్ధంగా పరిగణించాయి.ఈ యుద్ధంలో కరోనా శత్రువు నుంచి మనుషులను రక్షించడానికి సైనికుల రూపంలో వైద్యులు,సిబ్బంది యుద్ధంలో ముందుండి పోరాడుతున్నారు.ఈ యుద్ధం భారతదేశంలో సైతం జరుగుతోంది.అయితే విచారకర విషయం ఏంటంటే ఈ యుద్ధం కేవలం ప్రభుత్వ వైద్యులు,ఆసుపత్రులు మాత్రమే చేస్తుండడం.సాధారణ రోజుల్లో ఫీజుల రూపంలో,టెస్టుల రూపంలో ప్రజల ఆస్తులను సైతం రక్తం పీల్చిపిప్పి చేసే కార్పోరేట్‌,ప్రైవేటు ఆసుపత్రులు,వైద్యులు కీలకమైన ఇటువంటి తరుణంలో పూర్తిగా చేతులెత్తేసి తమ కుటిల,నీచ,వికృత మనఃస్థితిని మరోసారి చాటుకున్నారు.ఒకవైపు ప్రభుత్వ వైద్యులు అలుపు లేకుండా కరోనాపై పోరాడుతుంటే ప్రైవేటు వైద్యులు,ప్రైవేటు ఆసుపత్రుల యజమాన్యాలు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండడం విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం వందలమంది పేషంట్లతో కళకళలాడుతూ ఉండే ప్రవేటు ఆస్పత్రులు ఇప్పుడు మూతపడ్డాయి. ఒక్క ప్రైవేటు ఆస్పత్రి, ఒక్క ప్రవేటు వైద్యుడు యుద్ధంలో భాగస్వామి కాకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వాలుఐసోలేషన్కేంద్రాలకోసం, “క్వారంటైన్కేంద్రాలకోసం వెతుకులాడుతుంటే, ప్రవేటు ఆస్పత్రులులాక్ డౌన్ప్రకటించి తలుపులేసుకున్నాయి.మాస్కులకోసం,గ్లౌజుల కోసం ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతుంటే ప్రైవేటు వైద్యులు,ఆసుపత్రులు చోద్యం చూస్తున్నారు. మాస్కులు, గ్లౌజులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలానే ఉంటాయి. అవి మాత్రమే సరిపోతాయని కాదు. కానీ అవికూడా బయటకు తీస్తే మంచిది కదా! ప్రతిరోజే వేలు, లక్షలు, కోట్లు గడిస్తున్న ఆస్పత్రులు, వైద్యులు కనీస సామాజిక బాధ్యతగా ముందుకు రాకపోవడం, బాధ్యత మొత్తం ప్రభుత్వ వైద్యుల భుజస్కందాలపై వేసి చేతులు దులిపేసుకోవడం సామాజిక బాధ్యత అవుతుందా? ప్రజలనుండి అయితే ఇన్నేళ్ళుగా డబ్బులు పోగేసుకున్నారో ప్రజలు ఇప్పుడు కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నపుడు, ప్రజల ఆరోగ్యం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు ప్రైవేటు వైద్యులు కానీ, ప్రైవేటు ఆస్పత్రులు కానీ ముందుకు రాకపోవడం సామాజిక ద్రోహం అవుతుంది.యుద్ధం సైనికుడి బాధ్యత మాత్రమే కాదు. యావత్ ప్రజల భాగస్వామ్యం అవసరం. ఇప్పుడు కరోనపై యుద్ధం కూడా ప్రభుత్వ వైద్య బృందాల బాధ్యత మాత్రమే కాదు. దేశంలోని యావత్ వైద్య రంగం ప్రజలకోసం పనిచేయాల్సిన సమయం.ఎవరు అవునన్నా కాదన్నా  క్లిష్ట సమయంలో ప్రైవేటు వైద్యరంగం లాక్ డౌన్ ప్రకటించడం కచ్చితంగా ద్రోహమే.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos