అమరావతి: రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం తగదని మంత్రి ఆదినారాయణ రెడ్డి వైకాపా నాయకత్వానికి హితవు పలికారు. ‘ఎక్కడ ఏం జరిగినా తెదేపా నేతలపై ఆరోపణలు చేయడం’ వైకాపాకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ‘ఇతరులపై నిందలు మోపి పబ్బం గడుపు కోవడం ఇక నైనా మానుకోవాల’ని సూచించారు. శుక్రవారం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ‘వైఎస్ వివేకానందరెడ్డి మృతి బాధాకరం. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఆయన మృతిపై లోతుగా దర్యాప్తు జరపాలి. తప్పు చేసిన వారిని ఉరి తీయాలి. ఎక్కడో జరిగిన దాన్ని మాకు ఆపాదిం చడం ఎంత వరకు సమంజసం? గతంలో కోడికత్తి కేసులో నాపై ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. అభివృద్ధి విషయంలోనూ ఇలానే దుష్ర్పచారం చేస్తున్నారు. ఎన్నికలను నిజాయతీగా ఎదుర్కోలేకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. లోక్‌సభ సీటు విషయంలో వైఎస్ కుటుంబంలో వివాదాలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి లోక్ సభకు పోటీ చేయ దలచారు. విధాన పరిషత్తు ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆవేదనలో ఉన్నారు. అవినాశ్‌రెడ్డి, వివేకానంద రెడ్డి మధ్య గొడవలు ఉన్నాయి. గతంలో విజయమ్మపైనా వివేకానంద రెడ్డి పోటీ చేశారు. మొదట గుండెపోటు అని ఆ తర్వాత మాట మార్చారు. సీట్ల పంచాయతీలో మేం ఉంటే.. మాపై ఆరోపణలు చేయడం సమంజస మేనా? ఫ్యాక్షన్ వద్దని మేం రాజీపడి ప్రశాంతంగా ఉంటే మాపై ఆరోపణలా?గతంలో కోడికత్తి విషయంలో ఆరోపణలు చేశారు. అసలు నాకూ కోడికత్తికి ఏమైనా సంబంధం ఉందా?’ అని ప్రశ్నించారు అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే వాళ్లలో వాళ్ళే చూసుకోవాలి. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. తాను, ముఖ్యమంత్రి, లోకేష్, సతీష్ రెడ్డి పులివెందులలో జగన్‌ను ఎదు ర్కోలేక కుట్రకు పాల్పడ్డామని వైసీపీ నేతలు కొన్ని పత్రికలు, ఛానళ్లలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.