స్టాక్ మార్కెట్లు మరింతగా పతనం

  • In Money
  • March 16, 2020
  • 140 Views

ముంబై : ఓవైపు వెంటాడుతున్న కరోనా భయాలు.. మరోవైపు ఆర్థిక మాంద్యం ఆందోళనలు.. చమురు ధరల పతనం.. వెరసి దేశీయ మార్కెట్లకు ఈ సోమవారం మరో బ్లాక్‌ మండేగా మిగిలింది. భారత్‌, అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో నేటి ఆరంభం నుంచే సూచీలు భారీ నష్టాల్లో సాగాయి. ఇక రిజర్వ్‌ బ్యాంక్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో సూచీలు చివరి గంటల్లో మరింత కుంగాయి. ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 2,800 పాయింట్ల కిందకు పడిపోయింది. మొత్తంగా నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 2,713.41 పాయింట్లు పతనమై 31,390.07 వద్ద స్థిరపడింది. క్రితం సెషన్‌ నాటి ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 7.96శాతం తగ్గింది. ఇక నిఫ్టీ కూడా 7.61 శాతం నష్టంతో 757.80 పాయింట్లు దిగజారి 9,197.40 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ సహా దాదాపు అన్ని షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక్క యెస్‌ బ్యాంక్‌ మాత్రమే లాభపడింది. ఐరోపా మార్కెట్లు సోమవారం మధ్యాహ్నం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రపంచ ప్రధాన మార్కెట్లేవీ లాభాల్లో లేకపోవడంతో దేశీయ సూచీలు భారీ నష్టాల నుంచి అతిభారీ నష్టాల్లోకి జారుకొన్నాయి. మార్కెట్లు ముగిసిన తర్వాత ఆర్‌బీఐ అత్యవసర ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఏం కబురు వినాల్సి వస్తుందోననే ఒత్తిడితో మదుపరులు అమ్మకాలకు పాల్పడ్డారు. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించడంతో భారత్‌ కూడా అదే బాటను పట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. సంక్షోభం ముందు అత్యవసర చర్యగా దీనిని భావిస్తున్న మార్కెట్లు ఏం జరుగుతుందోనని ఆందోళనకు లోనయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos