ముంబై : ప్రస్తుతం తాను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నానని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. ‘స్వస్థ్ ఇండియా’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు తనకు క్షయ(టీబీ), హెపటైటిస్ బీ వ్యాధులు ఉండేవన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు గుర్తించలేకపోయానన్నారు. హెపటైటిస్ వల్ల అప్పటికే తన కాలేయం 75 శాతం పాడైందని తెలిపారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. టీబీకి చికిత్స ఉన్నా, ముందుగా గుర్తించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటే, ఇలాంటి వ్యాధుల్ని ముందుగానే పసిగట్టి, తగిన చికిత్స తీసుకోవచ్చని వివరించారు. తనలాగా మరొకరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ విషయాలు వెల్లడించానని చెప్పారు.