గుంటూరు : తురకపాలెం గ్రామంలో గత మూడు నెలల కాలంలో 30 మంది మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల బృందం మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో గ్రామాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించింది.ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకే లక్షణాలతో ఇన్ని మరణాలు జరగడం చూసి నేను షాక్‌కి లోనయ్యాను. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మేము గ్రామానికి వచ్చాం. మేము పరామర్శించిన 15 కుటుంబాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. త్రాగునీటి కలుషితమే ఈ మరణాలకు ప్రధాన కారణమని మా ప్రాథమిక పరిశీలనలో తేలింది’ అన్నారు. గ్రామంలోని సంజీవయ్య గుంట అనే పాడుబడ్డ నీటి నిల్వగుంట నుంచి కలుషిత నీటిని ట్యాంక్‌లోకి ఎక్కించడం వల్లే ఈ విషమ పరిస్థితి తలెత్తిందని అంబటి ఆరోపించారు. ‘ఇంతవరకూ ప్రభుత్వం స్పందించలేదు. మా బృందం వెళ్తుందని తెలుసుకున్నాకే స్థానిక ఎమ్మెల్యే వెళ్లారు. గ్రామంలో మంచినీరు దొరకడం లేదు కానీ మద్యం మాత్రం విరివిగా లభిస్తోంది. బెల్ట్‌షాపులు ఎత్తేస్తానన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయి?’ అని ఆయన ప్రశ్నించారు. అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ‘జనం పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కనీసం తాత్కాలికంగానైనా మినరల్ వాటర్ సరఫరా చేయాలి. పారిశుద్ధ్యం దారుణంగా ఉంది. బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలి. ఇకపై ఒక్క ప్రాణం పోయినా మౌనంగా ఉండం’ అన్నారు.