అల్లు అర్జున్-తివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఇప్పటికే చిత్రంలోని రెండు పాటలు సామాజిక మాధ్యమాల్లో,యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించాయి.త్రివిక్రమ్ సైతం చిత్రం కోసం తనదైన శైలిలో కథ,కథనం,మాటలు సమకూర్చినట్లు తెలుస్తోంది.కాగా ఈ చిత్రకథకు సంబంధించి ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది.అల వైకుంఠపురం చిత్రం ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు చిత్రానికి రీమేక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. 1958లో విడుదలైన నందమూరి తారక రామారావు – సావిత్రి కాంబినేషన్‌లో వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన చిత్రం ‘ఇంటి గుట్టు’ అప్పట్లో సూపర్ హిట్ అయింది.అందులో ఇద్దరు స్నేహితులు కొడుకులను మార్చుకుంటారు. అందులో ఒకరు దొంగ, మరొకరు పోలీస్ అవుతారు. చివరకు వాళ్లు తమ తల్లిదండ్రుల చెంతకు చేరారా లేదా అన్నదే కథ. అల వైకుంఠపురం చిత్ర కథ కూడా ఇలాగే ఉంటుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఒక ధనవంతుడు.. మరో ట్యాక్సీ డ్రైవర్ స్నేహితులు. వీళ్ల పిల్లలను చిన్నప్పుడే మార్చుకుంటారు. ధనవంతుడి కుమారుడైన బన్నీ అసలు విషయం తెలుసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్లాలనుకుంటాడు. అయితే, అక్కడే ఉన్న ట్యాక్సీ డ్రైవర్ కొడుకు సుశాంత్ మాత్రం తన తండ్రి దగ్గరకు వెళ్లనంటాడు. అదే సమయంలో నవదీప్ షాకింగ్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఇంతకీ ఎవరి కొడుకు ఎవరు..? నవదీప్ ఎవరు..? అనేది తెరపైనే చూడాలి.