కొరటగెరెలో ఫుడ్ కిట్ల గలాటా

కొరటగెరెలో ఫుడ్ కిట్ల గలాటా

తుమకూరు : హైటెక్‌ ఎమ్మెల్యేగా పేరొందిన తుమకూరు జిల్లా కొరటెగెరె శాసన సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ జీ. పరమేశ్వరపై స్వయానా ఆయన పార్టీకే చెందిన కాంగ్రెస్  కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా అనేక మంది పేదలు జీవన భృతిని కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాంటి వారిని ఆదుకోవడానికి వివిధ పార్టీల నాయకులు పేదలకు ఆహార ధాన్యాలతో కూడిన కిట్‌లను పంపిణీ చేస్తున్నారు. అదే ప్రకారం పరమేశ్వర కూడా తన నియోజకవర్గంలోని పేదలకు ఆహార కిట్‌లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలందరికీ ఈ కిట్‌లను పంపిణీ చేయాలన్నది సంకల్పం. అయితే పరమేశ్వర అనుయాయులు ఇష్టమొచ్చిన రీతిలో కిట్‌లను పంపిణీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు సగం మంది కాంగ్రెస్‌ సానుభూతిపరుల కుటుంబాలకు ఈ కిట్‌లు అందలేదని పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళా కాంగ్రెస్‌ తాలూకా కమిటీ అధ్యక్షురాలు జయమ్మ, ఏకంగా పరమేశ్వర తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కాంగ్రెస్‌ సానుభూతిపరుని కుటుంబానికి కిట్‌లు అందేలా ఆయన ఎలాంటి చొరవ తీసుకోలేదని, కిట్‌లు సక్రమంగా పంపిణీ అయ్యాయో, లేదో …అసలు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. అనేక కిట్‌లు చోరీకి గురయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీలో ఈ వ్యవహారం అనేక వివాదాలకు దారి తీసింది. పార్టీలో తొలి నుంచీ ఉన్నవారు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు….అనే రెండు వర్గాలు పార్టీ చీలిపోయిందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచీ పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి, నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారి పెత్తనం ఎక్కువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొరటగెరె నియోజకవర్గంలో సాగుతున్న ఈ తంతు సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కర్లు కొడుతుండడంతో పరమేశ్వర ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని పలువురు కార్యకర్తలు వాపోతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos