వారణాశి: కాశీ విశ్వేశ్వరుడి ఆలయ అభివృద్ధి, సుందరీకరణ పనులకు గత సమాజవాది ప్రభుత్వం సహకరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు కాశీ విశ్వనాధ ఆలయానికి వెళ్లే రహదారి, సుందరీకరణ పథకాలకు శుక్రవారం శంకుస్ధాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులకు తొలి మూడేళ్లలో అధికారంలో సమాజవాది ప్రభుత్వం సహకరించలేదని, యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన తర్వాతే అభివృద్ధి పథకాలు ఊపందుకున్నాయన్నారు. గత ప్రభుత్వం సహకరించి ఉంటే శుక్రవారం జరిగిన శంకుస్ధాపనలకు బదులుగా ప్రారంభోత్సవాలు జరిగి ఉండేవన్నారు. ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు తమ ప్రయోజనాల కోసమే పని చేసి కాశిని విస్మరించాయని ఆరోపించారు. కాశీ అభివృద్ధి తన చిరకాల స్వప్నమైనందునే ఈ నియోజక వర్గానికి లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఆక్రమణల మయమైన కాశీ విశ్వనాధ సన్నిధికి ముక్తి కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆక్రమణల్ని తొలగించి పాత భవనాలు స్వాధీనం చేసుకున్న తర్వాత 40 పురాతన దేవాలయాలు వెలుగులోకి వచ్చాయయన్నారు.