న్యూ ఢిల్లీ : భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ అధ్వర్యంలో ఈ నెల 17న ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ ర్యాలీకి ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లోక్సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే ముందు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. సమగ్ర కులగణన చేపడతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకటించి 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో తమ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూణ్నెళ్లలోపే 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను యువతకు ఇచ్చినట్లు తెలిపారు. 25 ఏళ్లలోపు డిప్లొమా అభ్యర్థుల కోసం రైట్ టు అప్రెంటిస్ చట్టం తెచ్చి నెలకు రూ.8,500 చొప్పున ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని తెలిపారు.