సోలాన్: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తొలి మంత్రి వర్గ సమావేశంలోనే లక్ష ప్రభుత్వాలు కల్పన, వృద్ధాప్య పింఛను వితరణ -రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భరోసా ఇచ్చారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ‘పరివర్తన్ ప్రతిజ్ఞ ర్యాలీ’లో ప్రసంగించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ గురువారం ఉనా, చంబాలో రెండు ర్యాలీల్లో పాల్గొన్న మరుసటి రోజే ప్రియాంక ఎన్నికల ప్రచారానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఆలోచించాలి. బీజేపీకి పెన్షన్లు ఇవ్వడానికి డబ్బుల్లేవు. డా పారిశ్రామికవేత్తలకు రుణాలు మాత్రం మాఫీ చేస్తారు. యువకులకు, ఉద్యోగులకు, మహిళలకు బీజేపీ చేసిందేమీ లేదు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీనే జరగలేదు. మేము అధికారంలోకి రాగానే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో పాటు, వృద్ధాప్య పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామ’ని హామీ ఇచ్చారు. అంతకు ముందు సోలాన్లోని మా శూలిని ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిభా సింగ్, అసెంబ్లీలో విపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్పర్సన్ సుఖ్వీందర్ సింగ్, పార్టీ సీనియర్ నేత రాజీవ్ శుక్లా తదితరులూ ర్యాలీలో ప్రసంగించారు.