తగ్గిన ఆయుఃప్రమాణం

తగ్గిన ఆయుఃప్రమాణం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ప్రజల ఆయుఃప్రమాణంలో (ఎక్స్‌పెక్టేషన్‌ ఆఫ్‌ లైఫ్‌ ఎట్‌ బర్త్‌) తగ్గుదల నమోదైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతంతో పోలిస్తే దేశ వ్యాప్తంగా ప్రజల ఆయుఃప్రమాణం సగటున రెండు నెలల కాలం తగ్గినట్లు తేలింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ‘డౌన్‌ టు ఎర్త్‌ ‘ ఒక కథనాన్ని ప్రచురించింది. రెండు నెలల కాలం తక్కువగానే కనిపించినప్పటికీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆయుఃప్రమాణాల లెక్కల్లో తగ్గుదల నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ గణాంకాల ప్రకారం 2016-2020 మధ్య 70 సంవత్సరాలుగా ఉన్న జీవిత కాలం 2017-2021 మధ్య కాలంలో 69.8 సంవత్సరాలకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో సగటున ఒక నెల కాలం, పట్టణ ప్రాంతాల్లో సగటున మూడు నెలల కాలపు జీవితకాలం తగ్గినట్లు తేల్చారు. 1970-75లో దేశ వ్యాప్తంగా సగటు ఆయుఃప్రమాణం49.7 సంవత్సరాలు ఉండగా, 2016-20 నాటికి అది 70 సంవత్సరాలకు చేరింది. 2017-21 మధ్య కాలంలో తగ్గుదల నమోదుకావడానికి కారణాలు కేంద్ర ప్రభుత్వ నివేదికలో లేవు. ప్రభుత్వ నివేదిక ప్రకారం 2020-21 మధ్య కాలంలో చోటుచేసుకున్న మొత్తం మరణాల్లో 17.3% కరోనాకారణంగా చోటుచేసుకున్నవి. వీటిని తప్పించినా కూడా ఆ కాలంలో అదనంగా 14 లక్షల మరణాలు చోటుచేసుక్నుట్లు తేలుతోంది. దీంతో కరోనా కారణంగా దేశంలో భారీ మరణాలు చోటుచేసుకున్న వాదనను తాజా గణాంకాలు బలపరుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2016-20లో 70.6 సంవత్సరాలు సగటు జీవన ప్రమాణం నమోదుకాగా, 2017-21లో 70.3 నెలల కాలం నమోదైంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos