కాబూల్ : తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజలు ఎలాగైనా సరే దేశం వదిలి వెళ్లాలని, ఏ దేశం వెళ్లినా ఫర్యాలేదనుకుని ఆస్తులు వదిలేసుకొని విమానాశ్రయం వైపు పరుగులు తీశారు. సోమవారం నుంచి పడిగాపులు కాస్తున్నారు. అయితే, సాయంత్రం సమయంలో తాలిబన్లు విమానాశ్రయం వద్ద విధ్వంసం సృష్టిస్తుండటంతో తాము వెళ్లకపోయినా పర్వాలేదు, ఆఫ్ఘన్ తదుపరి తరం వారినైనా రక్షించుకోవాలనే తపనతో చంటి బిడ్డలను విమానాశ్రయం కంచెను దాటించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పది, పన్నెండేళ్ల చిన్నారుల నుంచి నెలల వయసున్న చిన్నారులను కంచె దాటించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వయసున్న పిల్లలను తల్లిదండ్రులు వదిలేసుకొని బతకడం అంటే కష్టమే. కానీ, తప్పని సరి పరిస్థితుల్లో చిన్నారులు స్వేచ్చగా బతకాలని, తాలిబన్ల చెర నుంచి రక్షించుకోవాలని మనసు చంపుకొని చిన్నారులను కంచె దాటించి అమెరికా ఆర్మీకి అందిస్తున్నారు. నెలలు వయసున్న ఓ చిన్నారిని అమెరికన్ ఆర్మీకి అందిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఈ ఫొటోను చూసిన ప్రపంచం మొత్తం కంటతడి పెట్టుకుంటోంది. తాలిబన్ల నెత్తుటి క్రీడకు అభంశుభం తెలియని చిన్నారుల భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.