
ఒకవైపు సూపర్‌స్టార్‌గా అగ్రస్థానంలో దూసుకెళుతున్న ప్రిన్స్ మహేశ్‌బాబు ఇటీవల ఏఎంబీ పేరుతో మల్టిప్లెక్స్ ప్రారంభించి వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.తాజాగా మహేశ్‌బాబు నిర్మాతగా కూడా మారాడు.జీఎంబీ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన మహేశ్ టాలీవుడ్ కొత్త జేమ్స్‌బాండ్ అడవి శేష్‌తో కొత్త చిత్రం నిర్మాణానికి సిద్ధమయ్యాడు.26/11 ముంబయి ఉగ్రవాదుడల దాడుల నేపథ్యంలో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి మేజర్ అనే టైటిల్ కూడా ఖరారు చేసిన నిర్మాతలు గురువారం చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదల చేసారు.అప్పటి ముంబయి దాడుల్లో అత్యంత సాహసోపేతంగా ఉగ్రవాదులతో పోరాడి ఎంతోమంది ప్రజల ప్రాణాలు రక్షించి చివరకు వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ ప్రేరణతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గత ఏడాది గూఢచారితో తెలుగుచిత్ర పరిశ్రమ చూపును తనవైపు తిప్పుకున్న దర్శకుడు శశికిరణ్ దర్శకత్వంలోనే మేజర్ చిత్రం కూడా తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారా సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి పెరగనుంది.అడివి ఎంటర్ టైన్ మెంట్, శరత్ చంద్ర, ఎ+జి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ద్విభాషా చిత్రంగా తెలుగు, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అడివి శేష్ రచయితగా కూడా వ్యవహరించడం విశేషం. మేజర్ సినిమా షూటింగ్‌ను 2019 వేసవిలో ప్రారంభించనుంది చిత్రయూనిట్. 2020లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ హెడ్ లెయినె క్లెయినె మాట్లాడుతూ.ప్యాడ్ మాన్, 102 నాటౌట్ వంటి బాలీవుడ్ చిత్రాలతోపాటు మలయాళ చిత్రం 9 ని ప్రేక్షకులకు అందించి వారికి దగ్గరయ్యాం. మేజర్ సినిమా విషయానికి వస్తే ఇది శక్తివంతమైన కథే కాదు..మన దేశంలోని వారిని, సరిహద్దులను దాటి ఉన్న ఇండియన్స్‌ను ఇన్‌స్పైర్ చేసే చిత్రమిది. ఇటువంటి గొప్ప చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టనుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.సోని పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ణాని మాట్లాడుతూ – మహేష్, నమ్రతతో అసోసియేట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే వారిని హిందీ చిత్ర సీమలోకి మనస్ఫూర్తిగా అహ్వానిస్తున్నాం. అలాగే హీరో అడివిశేష్, డైరెక్టర్ శశికిరణ్ తిక్కకు కూడా బాలీవుడ్‌లోకి స్వాగతం పలుకుతున్నాం అన్నారు.