గత ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలోని మూడు జిల్లాల అనంతరం వైసీపీకి అత్యధిక స్థానాల్లో గెలుపు అందించిన ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు రాష్ట్రంలో ఎన్నికల వేడిని మరింత రాజేస్తున్నాయి.గత ఎన్నికల్లో అధికారినికి 20 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో ఈసారి వీలైనన్ని ఎక్కువ జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేయడానికి వైసీపీ అధినేత వ్యూహాలు అమలు చేస్తున్నారు.ఈ క్రమంలో వైసీపీకి మంచి పట్టున్న ప్రకాశం,నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి పావులు కదుపుతున్న జగన్ అందులో ఇప్పటకే సఫలీకృతులయ్యారు.కొద్ది రోజుల క్రితం ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను వైసీపీలో చేర్చుకున్న జగన్ ఇపుడు నెల్లూరు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డిని కూడా వైసీపీలో చేర్చుకోవడానికి పావులు కదుపుతున్నారు.ఆదాల వైసీపీలో చేరడానికి ఆసక్తి కనబరిచినట్లు సమాచారం.ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తెదేపా అధినేత చంద్రబాబు తన మార్కు రాజకీయాలకు తెరతీసారు.కొంత అసంతృప్తి రేకెత్తినా ఫరవా లేదు… ఆదాల పార్టీ వీడకుండా చూసుకోవాలన్న దిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో నెల్లూరు రూరల్ టికెట్ ను ఆదాలకు కేటాయిస్తున్నట్లుగా లీకులు ఇచ్చేశారట . అయినా కూడా ఆదాల పార్టీలో నిలిచే అవకాశాలు కనిపించడం లేదట.తాను సర్వేపల్లి లేదంటే కొవ్వూరు టికెట్లను అడిగానని – అయితే వాటిలో ఏ ఒక్కటినీ ఖరారు చేయకుండా… తాను అడగని నెల్లూరు రూరల్ టికెట్ ఇవ్వడమేమిటని ఆదాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అయినా తనకు ఇష్టమైన టికెట్ ను ఇవ్వకుండా… అడగని టికెట్ ను కేటాయించడమంటే ఏమిటర్థమని కూడా ఆదాల ప్రశ్నిస్తున్నారట. మొత్తంగా సీటు కేటాయించినా… ఆదాలను సంతృప్తిపరచలేకపోయామే అన్న కోణంలో ఇప్పుడు టీడీపీ తల పట్టుకుందట. మరోవైపు టీడీపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేలోగానే ఆదాల టీడీపీని వీడటం ఖాయమేనన్న వార్తలు వినిస్తున్నాయి. అంతేకాకుండా ఓడిపోయే టీడీపీలో ఉండటం ఇష్టం లేకే… సీటిచ్చినా కూడా ఆ పార్టీలో కొనసాగేందుకు ఆదాల ఇష్టపడటం లేదన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మార్చ్1న వైసీపీలోకి మాగుంట…

ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో కీలకనేతగా గుర్తింపున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి
త్వరలోనే తెదేపాకు షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే తన మద్దతుదారులు,వర్గీయులతో
సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు,సూచనల మేరకు వైసీపీలో చేరడానికి నిర్ణయిం తీసుకున్నట్లు
సమాచారం.పార్టీ మారుతుండడంపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ..ఇదేనెల 28వ తేదీన తన మనసులోని
మాట బహిర్గతం చేస్తానంటూ చెప్పడం ద్వారా తెదేపాను వీడనున్నట్లు పరోక్షంగా సంకేతాలు
ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.ఈ నెల 20న లండన్ టూర్ కు వెళ్లనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి 26న హైదరాబాద్‌కు రానున్నారు. అనంతరం
ఇదేనెల 28వ తేదీన జగన్‌తో సమావేశమై మార్చ్‌౧వ తేదీన వైసీపీలో అధికారికంగా చేరడానికి
ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట ఫ్యామిలీకి అటు తమ సొంత జిల్లాతో పాటుగా ఇటు ప్రకాశం జిల్లాలోనూ మంచి పట్టుందనే చెప్పాలి. పారిశ్రామికరంగంలో తమకంటూ ఓ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్న మాగుంట ఫ్యామిలీ రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేసింది. ఈ క్రమంలో మాగుంట టీడీపీని వీడి వైసీపీలోకి చేరితే… ఈ రెండు జిల్లాల్లో టీడీపీకి భారీ దెబ్బ తగలడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో ఈ రెండు జిల్లాల్లో సత్తా చాటాలని చూస్తున్న జగన్ కు మాగుంట చేరిక మరింత బలాన్ని ఇచ్చినట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.