కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం – 10 మంది మృతి

కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం – 10 మంది మృతి

లఖ్‌ నవ్‌:మీర్జాపుర్‌-ప్రయాగ్‌రాజ్‌ జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొన్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 19 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

ఛత్తీస్​గఢ్​లోని కోర్బా జిల్లాకు చెందిన 10 మంది ప్రయాగ్​రాజ్ మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడానికి బొలెరోలో బయలుదేరారు. శనివారం వేకువజామున 2గంటల సమయంలో బొలెరో వేగంగా వెళ్తోంది. ప్రయాగ్‌ రాజ్-మీర్జాపుర్ హైవేపై ఓ బస్సును ఢీకొట్టింది. దీంతో బొలెరో ఉన్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ఉన్న 19 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు

క్షతగాత్రులందరూ మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు పోలీసులు. వారందరూ ప్రయాగ్​రాజ్​లోని త్రివేణి సంగమంలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుడి దర్శనం కోసం వారణాసికి వెళ్తున్నారు. ఈలోపే వారి బస్సును బొలెరో ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అలాగే బాధితుల అరుపులు విన్న స్థానికులు సైతం ప్రమాదస్థలికి వచ్చారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో బొలెరో నుజ్జునుజ్జైంది. కొందరి మృతదేహాలు బొలెరో క్యాబిన్​లో ఇరుక్కుపోయాయి. వాటిని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ప్రమాదం తర్వాత ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్ తరుణ్ గబా, డీఎం రవీంద్ర కుమార్ మాంధాద్ ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. తదుపరి దర్యాప్తు చేపట్టారు. “ప్రయాగ్​రాజ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ” అని యూపీ సీఎం కార్యాలయం ఎక్స్​ వేదికగా పోస్టు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos