న్యూ ఢిల్లీ : దేశంలోని చెరసాల ల్లో నేరగాళ్ల కంటే నిందితులే ఎక్కువ మంది ఉన్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో- 2019 నివేదిక తెలిపింది. దీని ప్రకారం 4,78,600 మంది నిర్బంధంలో ఉన్నారు. ప్రతి పది మంది బంధితుల్లో ఏడుగురు కేసు విచారణను ఎదుర్కొంటోన్న నిందితులే. నిందితుల్లో 37 శాతం మంది అన్యాయంగా మూడు నెలల నుంచి ఏడాది వరకు జైలు జీవితం గడుపుతున్నారు. ఫలితంగా వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడమే కాకుండా ఉద్యోగాల్నీ కోల్పోయారు. నిందితుల్లో 64 శాతం మంది వెనకబడిన, నిమ్న వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. శాతాల వారీగా ఎస్సీలు- 21.7, షెడ్యూల్డ్ తెగలు- 12.3, వెనకబడిన వర్గాలు-30 ప్రతి ఐదుగురు నిందితుల్లో ఒకరు ముస్లిం. దారిద్య్రక పరిస్థితులు, ఉచిత న్యాయ సహాయం దొరక్క పోవడం వల్లనే ఈ వర్గాలకు చెందిన వారు జైళ్లలో మగ్గుతున్నారని సామాజిక శాస్త్రవేత్తలు తేల్చారు.