కలలు కనడం సహజం. కానీ వాటిని ఏ కొద్దిమందో నిజం చేస్తుంటారు. కష్టానికి తగ్గ ఫలితం వస్తే ఆ కిక్కే వేరు. టాలీవుడ్‌లో సెన్సేషన్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం అలాంటి మూడ్‌లోనే ఉన్నాడేమో. ఈ యంగ్ హీరో ఫోర్బ్స్ జాబితాలో టాప్ 30లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి పరిచయమైనా.. సరైన టైమ్‌కోసం.. సరైన సినిమా కోసం ఎదురుచూశాడు విజయ్. సినిమాలు తన దగ్గరకు వచ్చినప్పుడు తనకు మాత్రమే సొంతమైన నటనాశైలితో ఆకట్టుకున్నాడు. ఇక స్టేజ్ ఎక్కితే.. మాటలతో అందర్నీ మాయ చేసేస్తాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా వరుస హిట్‌లతో దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించడంతో.. తన అభిమానులతో ఓ విషయాన్ని పంచుకున్నాడు. ‘నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు.. రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చెయ్యలేదని నా అకౌంట్‌ను లాక్ చేసిన్రు. అప్పుడు మా నాన్న.. ముప్పై వచ్చే లోపు బాగా సెటిల్ కావాలని, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడే.. సక్సెస్‌ను ఎంజాయ్ చేయగలవని అన్నారు. నాలుగేళ్ల తరువాత.. ఫోర్బ్స్ సెలబ్రెటీలో స్థానంలో సంపాదించాను’ అంటూ ట్వీట్ చేశాడు. విజయ్ ప్రస్తుతం డియర్‌కామ్రేడ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.