బెంగళూరు : శత్రువు చేతికి దొరికినా చెరగని ధీరత్వాన్ని ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ ఇప్పుడు యువతకు మార్గదర్శకుడవుతున్నాడు. ఎందులో అంటే…ఆయన మీసకట్టు, హెయిర్ స్టైల్లో. బెంగళూరు నగరానికి చెందిన హెయిర్ డిజైనర్ నానేశ్, అభినందన్ హెయిర్ స్టైల్ ఉచితంగా చేస్తానని ప్రకటించాడు. ఆ ప్రకటన వెలువడడమే ఆలస్యం, వందల మంది ఆయన బ్యూటీ సెలూన్ వద్ద క్యూ కట్టారు. సోమవారం ఒక్క రోజే 650 మందికి ఉచితంగా ఆ విధంగా జుట్టును, మీసాలను తీర్చిదిద్దాడు. నగరంలో నానేశ్‌కు రెండు ప్రాంతాల్లో బ్యూటీ సెలూన్లు ఉన్నాయి. మరో వైపు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అభినందన్ తమ కస్టడీలో ఉన్నప్పుడు అనేక ప్రశ్నలు అడిగారు. ఇండియాలో మీరు ఏ ప్రాంతానికి చెందినవారని పాక్ అధికారులు అడిగినప్పుడు, దక్షిణాదివాడని అభినందన్ స్థూలంగా సమాధానమిచ్చాడు. అయితే మొన్న తమిళనాడులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని, అభినందన్ తమిళనాడుకు చెందినవాడు కావడం గర్వకారణమంటూ అతని చిరునామాను బయటపెట్టేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ప్రధానిపై వ్యంగ్యోక్తులు శరపరంపరగా వచ్చి పడుతున్నాయి