న్యూఢిల్లీ : రద్దు చేసిన నల్ల చట్టాలు (వ్యవసాయ చట్టాలు)ను దొడ్డిదారిన అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. నూతన ‘విధానం’ పేరుతో దాని ప్రతులను అన్ని రాష్ట్రాలకూ పంపుతోందని, అభిప్రాయాలు కోరుతోందని ఆయన తెలిపారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా డిమాండ్ల సాధన కోసం పంజాబ్‌లో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు ఏమైనా జరిగితే అందుకు బిజెపియే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. పంజాబ్‌లో రైతులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్రం కనీసం వారితో సంప్రదింపులు కూడా జరపడం లేదని కేజ్రీవాల్ మండిపడ్డారు. మూడు సంవత్సరాల క్రితం రైతుల డిమాండ్లను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తోందని విమర్శించారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో మాట్లాడకపోవడం బిజెపి అహంకారం కాక మరేమిటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.