శ్రీనగర్ :ఇకపై తుపాకీతో ఎవరు కనిపించినా కనికరం లేకుండా కాల్చి పారేస్తామని భారత పదాతి దళం జమ్ము-
కాశ్మీర్ ప్రజానీకాన్ని హెచ్చరించింది. ‘‘పుల్వామా ఉగ్రదాడి జరిగిన 100 గంటల లోపే దీనికి కారణమైన జైషే మహ్మద్ నాయకత్వాన్ని మట్టుబెట్టాం. పాకిస్తాన్ నేతృత్వంలోనే కశ్మీర్‌లోయలో జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కశ్మీర్లో ఇకపై చట్టవిరుద్ధంగా
ఎవరు ఆయుధాలతో కనిపించినా కాల్చిపారేస్తాం. ఈ విషయంలో ఏమాత్రం కనికరం చూపించేది లేదు..’’ అని పదాతి దళం 15 కార్ప్స్ కమాండర్ కన్వాల్ జీత్ సింగ్ దిల్లాన్ మంగళవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధుల సమావేశంలో
కుండబద్ధలు కొట్టారు. తుపాకుల్ని పట్టుకుని తిరిగేవాళ్లను రూపుమాపేస్తామని పునరుద్ఘాటించారు. ఫిదాయిన్ దాడులను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కశ్మీరీలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని 14411 నెంబరు సహాయవాణిని ప్రారంభించినట్లు సీఆర్పీఎఫ్ ఆఫీసర్ జుల్ఫీకర్ హసన్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులకు భద్రతా దళాలు అండగా నిలుస్తున్నాయన్నారు. ఉగ్రవాదులుగా మారే వారి సంఖ్య ఇటీవల
గణనీయంగా తగ్గిందని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్.పి. పాణి తెలిపారు. గత మూడు నెలల్లో ఎటువంటి రిక్రూట్మెంట్ జరగలేదన్నారు ఉగ్రవాదుల్లో చేరిన యువతను వారి కుటుంబ సభ్యులు వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని తుది హెచ్చరిక జారీ
చేశారు. ఉగ్రవాదులంతా వెంటనే లొంగిపోవాలనీ.. లేకుంటే సైన్యం చేతుల్లో మరణించక తప్పదని తేల్చి చెప్పారు. జమ్మూ -కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు
తమకు ఇంతకు మించి వేరే మార్గం లేదని దిల్లాన్ పేర్కొన్నారు. ఈనెల 14న పుల్వామాలో చోటుచేసుకున్న కారుబాంబు వంటి దాడి కశ్మీర్లో చాలా కాలం తర్వాత జరిగిందనీ పుల్వామా దాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థాలపై తమకు స్పష్టమైన సమాచారం ఉందనీ. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున వాటిని వెల్లడించలేమని
ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.