న్యూఢిల్లీ: వివాదాస్పద తూత్తుకుడి స్టెరిలైట్ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని జాతీయ హరిత న్యాయ పంచాయతి ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత కొనసాగుతుందని సోమవారం తీర్పు వెలువ రించింది. స్టెరిలైట్ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు పరిచేలా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వేదాంత గ్రూపు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుపై విచారణ చేపట్టే అధికార పరిధి జాతీయ హరిత న్యాయ పంచాయతికి లేదని పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని వేదాంత గ్రూపుకు సూచించింది.‘స్టెరిలైట్’ రాగి పరిశ్రమను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని వేదాంత గ్రూప్ హరిత న్యాయ పంచాయతిలో దాఖలు చేసింది. విచారణ చేపట్టిన హరిత న్యాయ పంచాయతి తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలని గత డిసెంబర్ 15న ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ గతేడాది నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకుదిగినపుడు పోలీసులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరపటంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.