టీమిండియాలో స్థానం దక్కడంపై పంజాబ్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండె హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఆసీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు అతను
ఎంపికైన విషయం తెలిసిందే. దీనిపై అతను మీడియాతో మాట్లాడుతూ జాతీయ జట్టుకు ఆడాలన్న తన కల నెరవేరిందని అన్నాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించడం ప్రతి ఆటగాడికి గర్వకారణమేనని, ఇది తన స్వప్నం కూడా అని
వివరించాడు. ఇంత త్వరగా జాతీయ జట్టులో భాగం అవుతానని అనుకోలేదని, దీనిని తన అదృష్టంగా
భావిస్తున్నానని చెప్పాడు. ఇండియా‘ఏ’, రంజీ ట్రోఫీల్లో తన ఆట తీరును చూసి సెలక్టర్లు
ఎంపిక చేసి ఉంటారనుకుంటున్నానని తెలిపాడు. తన సత్తా నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన సెలక్టర్లకు ధన్యవాదాలు చెప్పాడు.