పుల్వామాలో భద్రతా బలగాలపై జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీమిండియా క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఘటనను ఖండించారు. ఈ ఘటనలో అమరులైన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు
* ‘ఈ ఘటనపై కదన రంగంలోనే సమాధానం చెప్పాలి. శ్రీనగర్-జమ్మూ హైవేలో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి’. -గౌతమ్ గంభీర్
* ‘ఈ దారుణదాడి గురించి విన్నాక గుండె బరువెక్కింది. పుల్వామా ఘటనలో అమరులైన వీరుల ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలి. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ -వీవీఎస్ లక్ష్మణ్
* ‘పుల్వామాలో ఉగ్రదాడి జరిగిందని వార్తల్లో చూశాను. ఈ దాడిని అందరూ మూకుమ్మడిగా ఖండించాలి. ఈ ఘటనలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబం ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలి’. -శిఖర్ ధావన్
* ‘వీర జవాన్ల మరణం గురించి విన్నాక ఎంతో షాక్కు గురయ్యాను. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’. -విరాట్ కోహ్లీ
* ‘గుండె బరువెక్కుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు ఎంత నరకయాతన అనుభవించి ఉంటారో. ఈ ఘటనకు బాధ్యులైన వారికి త్వరలో బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆశిస్తున్నా’. -మహమ్మద్ కైఫ్
* ‘జవాన్లపై దాడి దుర్ఘటన నన్ను కలిచి వేస్తోంది. బాధిత కుటుంబాలు ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలి’. – సురేశ్ రైనా.
* ‘ఇది చాలా దారుణమైన ఘటన. ఇలాంటి బాధను వ్యక్తీకరించడానికి మాటల రావడం లేదు. బాధితులు త్వరగా కోలుకోవాలి’. -వీరేంద్ర సెహ్వాగ్