శ్రీనగర్ : జమ్మూలో శుక్రవారం జరిగిన బంద్ హింసాత్మకంగా మారడంతో గుజ్జార్ నగర్‌లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞల్ని విధించారు. ఉగ్ర దాడిలో 44మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతికి నిరసనగా జమ్మూ వాణిజ్య, పరిశ్రమల
సంఘం,న్యాయవాదుల సంఘం బంద్‌కు పిలుపు నిచ్చాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించడంతో అవాంఛనీయాల్ని అరి కట్టేందుకు ముందుజాగ్రత్త చర్యగా కర్ఫ్యూను విధించామని అధికారులు తెలిపారు. ఆందోళనకారులు కర్రలు, రాళ్ళతో దాడులకు దిగటంతో
పలు వాహనాలు ధ్వంసమైనట్లు స్థానికులు వెల్లడించారు రెండు గుంపుల మధ్య ఘర్షణలు చెలరేగాయన్నారు., అదనపు బలగాల ఏర్పాటుకు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. కొందరు దుండగులు ఉద్రిక్తతలను ప్రేరేపించి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జమ్మూలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆమె చెప్పారు. అల్ప సంఖ్యాకుల నివాస ప్రాంతాల్లో భద్రతను పెంచాలని గవర్నర్‌ను కోరారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు.