దిల్లీ: మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్పేయీ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్, మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్రమంత్రులు పలు పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరై వాజ్పేయీకి నివాళులర్పించారు. ప్రధాని మోదీ, వాజ్పేయీ సేవలను గుర్తుచేసుకున్నారు. ‘ఇప్పటి నుంచి అటల్ జీ మనల్ని ఆశీర్వదిస్తారు. మనకు స్ఫూర్తినిస్తారు. ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నారు. అయినప్పటికీ పదవిని ఆశించకుండా ప్రజల సమస్యలను లేవనెత్తేవారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తన సిద్ధాంతాలను వదలని గొప్ప వ్యక్తి అటల్జీ. ఆయన ప్రసంగంలో తెలియని ఓ శక్తి ఉంటుంది. ఆయనో గొప్ప నేత’ అని మోదీ కొనియాడారు. వాజ్పేయీ సుదీర్ఘ కాలం అనారోగ్యంతో బాధపడుతూ గతేడాది ఆగస్టు 16న తుదిశ్వాస విడిచారు.