ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుంటూరుకు రానున్నారు. ఉదయం 11.15 గంటలకు ఆయన గుంటూరులోని ఏటుకూరు బైపాస్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తర్వాత అక్కడికి సమీపంలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోదీ సభకు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంటుందనే విషయంపై బీజేపీ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలం అంతంత మాత్రమే. దీనికి తోడు మిత్ర పక్షంగా ఉన్న తెదేపా వైదొలగడంతో ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. మోదీ పర్యటన సందర్భంగా కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందేమోనని బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.