అమరావతి: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ యూట్యూబ్ ఛానల్లో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆర్ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఇది జనసేన ముసుగులో జరుగుతున్న రౌడీయిజం అని, ఇలాంటి వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన హెచ్చరించారు.వివరాల్లోకి వెళితే, మచిలీపట్నం మండలం సత్రంపాలేనికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్, మంగళవారం ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ఎన్నికల హామీలపై కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వందలాది మంది జన సైనికులు నిన్న రాత్రి గిరిధర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. అనంతరం ఆయనపై దాడి చేసి, బలవంతంగా క్షమాపణ చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విషయం తెలుసుకున్న పోలీసులు గిరిధర్‌ను చిలకలపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి పేర్ని నాని, జరిగిన ఘటనపై పోలీసులను ఆరా తీశారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. “కేవలం పవన్‌ను ప్రశ్నించినందుకే వంద మందికి పైగా జనసేన గూండాలు గిరిధర్‌పై, ఆయన ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. బలహీన వర్గానికి చెందిన రజకుడనే చిన్నచూపుతోనే ఈ దాడికి పాల్పడ్డారు. పవన్‌ను ఎంతోమంది విమర్శిస్తున్నారు, వారిపై ఎందుకు ప్రతాపం చూపడం లేదు? బలహీనులే మీకు కనిపిస్తారా?” అని ప్రశ్నించారు.”జగన్ మోహన్ రెడ్డిని, నన్ను నోటికొచ్చినట్లు తిడతారు. కానీ పవన్‌ను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? నమస్కారం పెట్టలేదని పోలీసులనే కొట్టే స్థాయికి వచ్చారు. ఈ గూండాలను తక్షణం అదుపు చేయాలి. గిరిధర్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని పేర్ని నాని డిమాండ్ చేశారు. అనంతరం ఇరు పార్టీల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.