అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది.ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. “వర్షాల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల వారు మరింత అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన తెలిపారు. రైతులు, మత్స్యకారులు కూడా వాతావరణ సూచనలను గమనిస్తూ సురక్షితంగా ఉండాలని కోరారు.