న్యూఢిల్లీ : గ్రేట్ నికోబార్ దీవుల ప్రాజెక్టు గిరిజనుల హక్కుల్ని తుంగలో తొక్కేస్తుందని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నికోబార్ ప్రజలు అన్యాయానికి గురవుతారని, ఈ ప్రాజెక్టుతో సున్నితమైన పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ ద హిందూ ఆంగ్ల పత్రికలో రాసిన ఆర్టిల్‌ను రాహుల్‌గాంధీ సోమవారం సోషల్‌మీడియాలో షేర్ చేశారు. భారత ప్రభుత్వం ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, అంతర్జాతీయ విమానిశ్రయం, ఎనర్టీ ప్లాంట్, టౌన్‌షిప్, సమగ్ర అభివృద్ధి వంటి లక్ష్యాలతో ఈ ప్రాజెక్టుని నిర్మించనుంది. అయితే ఈ ప్రాజెక్టు చేపట్టడం ఒక దుస్సాహసం. గిరిజన హక్కుల్ని తుంగలో తొక్కడం, చట్టపరమైన, చర్చా ప్రక్రియలను అపహాస్యం చేయడమే అని రాహుల్‌గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.కాగా, సోనియాగాంధీ హిందూలో రాసిన ఆర్టికల్‌లో ఈ ప్రాజెక్టు వల్ల నికోబార్ ప్రజలకు, సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు జరిగే అన్యాయాన్ని ఆమె ఎత్తిచూపారు. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన వృక్షజాలం, జంతుజాలం నాశనం అవుతుందని, దీంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని సోనియా గాంధీ హైలెట్ చేశారు. రూ. 7,200 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ఆ ద్వీపంలోని గిరిజన వర్గాల ఉనికికి ముప్పు కలిగిస్తుంది. నికోబారీ గిరిజనుల పూర్వీకుల గ్రామాలు ప్రాజెక్టు ప్రతిపాదిత భూభాగ పరిధిలోకి వస్తాయని అందుకే 2004 హిందూ మహాసముద్ర సునామీ సమయంలో వీరంతా తన గ్రామాలను ఖాళీ చేయవలసి వచ్చిందని ఆమె ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు గిరిజనులను అక్కడి నుంచే లేకుండా చేసే ప్రయత్నమేనని సోనియా హైలెట్ చేశారు. కేంద్రం ఈ ప్రాజెక్టును నిర్మించడానికి తెచ్చిన షోంపెన్ పాలసీ, గిరిజన తెగకు, వారి సంక్షేమానికి పెద్ద ముప్పును తెస్తుంది. ఎందుకంటే వారు నివసించే భూభాగాన్ని డీనోటిఫై చేస్తుంది. దీంతో వారి ఉనికి, నివాసం ప్రమాదంలో పడుతుంది ఈ అంశాలను కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ నోటిఫై చేసిందని ఆమె ఈ ఆర్టికల్‌లో పేర్కొన్నారు. గిరిజన హక్కుల్ని పరిరక్షించడానికి స్థాపించబడిన రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన సంస్థలు లేవనెత్తే అంశాలను ఈ ప్రక్రియలో పక్కన పెట్టారని సోనియా తెలిపారు.