‘ప్రీతి’ కుటుంబాన్ని బెదిరించిన వారిపై చర్యలు

‘ప్రీతి’ కుటుంబాన్ని బెదిరించిన వారిపై చర్యలు

అమరావతి : సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ, కులం పేరు ప్రస్తావిస్తూ అవమానించిన జనసేన నాయకుడిపై కేసు నమోదు చేసి, తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. బాధిత కుటుంబం న్యాయం కోసం ప్రశ్నిస్తే కులం పేరిట హేళన చేసిన జన సేన నాయకులు గాదె వెంకటేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, మహిళా కాంగ్రెస్‌ నాయకులు సుంకర పద్మశ్రీ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి పి.దుర్గాభవాని, పిఒడబ్ల్యు రాష్ట్ర నాయకులు పి.పద్మ, వాసవ్య మహిళా మండలి ప్రతినిధి కీర్తి, ఐప్వా రాష్ట్ర కార్యదర్శి నాగమణి గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రీతి తల్లి ఆవేదన అన్ని కుటుంబాలకు ఆవేదనగా ఉందని పేర్కొన్నారు. 10వ తరగతి చదివే బాలిక వసతి గృహంలో చనిపోయిందని, పోస్ట్‌మార్టంలో హత్యగా చెప్పినా, విచారణలో సాక్ష్యాలను మాయం చేశారని విమర్శించారు. మాయం చేసిన వారిని విచారించకుండా బాధితులకు భూమిచ్చామని, డబ్బులిచ్చామని, ఉద్యోగం ఇచ్చామని, వాటిని తిరిగి ఇచ్చేయాలనే హక్కు నాయకులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. న్యాయం అడగకుండా ఉండేందుకే పరిహారం, ఉద్యోగం ఇచ్చారా? నిందితులను అరెస్టు చేయాలని కోరడం నేరమా? అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం సరైంది కాదన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తన పర్యటనలో ప్రీతి కుటుంబానికి పరిహారం ఇచ్చామని చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos