గవర్నర్లు కేవలం ప్రతీకాత్మకమే

గవర్నర్లు కేవలం ప్రతీకాత్మకమే

న్యూఢిల్లీ : ప్రజాప్రతినిధులతో కూడిన చట్ట సభలకే చట్టాన్ని చేసే అధికారాలున్నాయని, గవర్నర్లు కేవలం ఆ అధికారాలకు ప్రతీకాత్మక నేతలు మాత్రమేనని, చట్టాలను చేయడంలో వారికి పాత్ర ఉండదని ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాదులు సుప్రీంకోర్టులో స్పష్టం చేశారు. శాసనసభలు పంపిన బిల్లులను గవర్నర్లు తొక్కిపట్టి జాప్యం చేసే అధికారం లేదన్నారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా బిల్లులను ‘వీలైనంత త్వరగా పరిష్కరించాలి’ అన్న నిబంధన ఉందని, దీనర్థం ‘వెనువెంటనే లేదా తక్షణమే’ అని పేర్కొన్నారు.బిల్లులను తమ వద్దనే అట్టిపెట్టుకోవడంలో గవర్నర్లకు గల విచక్షణాధికారాలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లు సుప్రీంకోర్టులో బుధవారం వాదించాయి. చట్టాలను చేయడంలో చట్టసభలకు పాత్ర వుంటుంది తప్ప గవర్నర్లకు అందులో ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశాయి. గవర్నర్లకు ప్రతీకాత్మక (నామమాత్రపు) అధికారాలే వుంటాయని పేర్కొన్నాయి. గవర్నర్ల ఇష్టానుసారంమీద ప్రజల అభీష్టం లేదా సంకల్పం ఆధారపడి వుండదని పేర్కొన్నాయి. బిల్లును తన వద్దనే సుదీర్ఘకాలం అట్టిపెట్టుకోవడం లేదా దాన్ని తొక్కిపట్టి వుంచడమంటే బిల్లును ఆమోదించడానికి నిరాకరించడమేనని ఆ మూడు రాష్ట్రాలు పేర్కొన్నాయి. బిల్లులను పరిశీలించేటపుడు గవర్నర్‌ వంటి ఉన్నత రాజ్యాంగ అధికారి చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తారని కేంద్రం భావించినట్లైతే రాష్ట్రాల శాసనసభల పట్ల కూడా అదే మర్యాద పాటించాలని, ఆ సభలు కూడా ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలేనని వాదించాయి. రాష్ట్రపతి పంపిన ప్రస్తావనపై సుప్రీంకోర్టులో ఏడవరోజైన బుధవారం కూడా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగించింది.

గవర్నర్లకు బిల్లులు పంపేది ఆమోదించడానికే : కపిల్‌ సిబల్‌

ఈ విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్‌ తరపున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ..చట్ట సభలు బిల్లులను గవర్నర్లకు పంపేది ఆమోదించడానికేనని నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కావాలంటే రాష్ట్ర చట్టాన్ని రద్దు చేయవచ్చని లేదా కోర్టుల్లో సవాలు చేయవచ్చన్నారు. కానీ గవర్నర్లు బిల్లులను తొక్కిపట్టరాదని పేర్కొన్నారు. కేంద్రం కూడా ప్రజల సంకల్పాన్ని, వారి అభీష్టాన్ని గౌరవించాల్సిందేనని తెలిపారు.హిమాచల్‌ ప్రదేశ్‌ తరపున వాదనలు వినిపిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, న్యాయవాది ఆనంద్‌ శర్మ మాట్లాడుతూ, రాష్ట్రపతి లేదా గవర్నర్లు కనీసం పార్లమెంట్‌ను లేదా అసెంబ్లీలను సమావేశపరచడం కూడా చేయరని అన్నారు. ఆ ప్రక్రియ అంతా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. కర్ణాటక తరపున గోపాల్‌ సుబ్రమణియం మాట్లాడుతూ, ఒకే రాష్ట్రంలో ద్వంద్వ పాలన (గవర్నర్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వం) వుండరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos