న్యూఢిల్లీ : వర్షాలకు అతలాకుతలమవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించాలని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. పంజాబ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితి మరీ అందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు సహాయమందించాలని రాహుల్ కోరారు. ‘ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ.. వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్థంగా ఉన్న ఇలాంటి క్లిష్ట సమయంలో మీరు (ప్రధాని మోడీ) శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో త్వరితగతిన కేంద్ర ప్రభుత్వ సహాయం అందించడం చాలా అవసరం. వేలాది కుటుంబాలు తమ ఇళ్లను, ప్రాణాలను, ప్రియమైన వారిని కాపాడుకోవడానికి కష్టపడుతున్నాయి. అందుకే ఈ రాష్ట్రాలకు ముఖ్యంగా రైతుల కోసం ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించాలని, ఆ ప్రాంతాలలో రక్షణ కార్యకలాపాలను వేగవంతం చేయాలి’ అని రాహుల్ ఎక్స్ పోస్టులో మోడీని కోరారు.