రాజ మహేంద్ర వరం :ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 47 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. మరో పక్క ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఇక్కడ 10.60 అడుగుల మేర ప్రవాహం ఉంది. బ్యారేజ్ 175 గేట్లను పైకి లేపు సముద్రంలోకి 8.35 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తాగు సాగు నీటి అవసరాల నిమిత్తం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 8200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రానున్న 24 గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.