కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ముఖ్యమంత్రులకు స్టాలిన్‌ లేఖ

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ముఖ్యమంత్రులకు  స్టాలిన్‌ లేఖ

చెన్నై:కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. నిజమైన సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయాలని అందులో కోరారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయడానికి తమిళనాడు సర్కార్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ వెబ్‌సైట్‌లో తమ అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు.   “కేంద్ర స్థాయిలో పెద్ద మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అవి రాష్ట్ర విధులను ఖూనీ చేస్తాయి. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లకు సంబంధించిన షరతులను, కేంద్ర పథకాల మార్గదర్శకాలను, కొన్ని ఆమోదాలను, రాష్ట్ర ప్రాధాన్యాలను అవి ప్రభావితం చేస్తాయి” అని స్టాలిన్ తన లేఖ​ లేఖలో ఆరోపించారు. “ఇప్పుడు మనం నిర్ణయాత్మక సమయంలో ఉన్నాం. ఈ పరిణామాలను తిరిగి అంచనా వేయడం, నిజమైన సమాఖ్యవాదాన్ని బలోపేతం చేసే భవిష్యత్తు ప్రణాళికను సృష్టించడం అవసరం” అని స్టాలిన్ అన్నారు.   కేంద్రం, రాష్ట్రాల సంబంధాలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ గురించి ప్రస్తావించారు స్టాలిన్. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ మాజీ వైస్- ఛాన్సలర్ కె. అశోక్ వర్ధన్ శెట్టి, తమిళనాడు ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్- ఛాన్స​లర్ ఎం. నాగనాథన్ ఆ కమిటీలో ప్యానెల్ సభ్యులుగా ఉన్నారని స్టాలిన్ తెలిపారు.    ఆ కమిటీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలను సేకరించడానికి ఒక ఆన్‌లైన్ ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేసిందని స్టాలిన్ వెల్లడించారు. ఆగస్టు 23వ తేదీన కేంద్రం- రాష్ట్ర సంబంధాలపై జరిగిన సెమినార్‌లో ఆయన దీనిని ప్రారంభించారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, సంబంధిత విభాగాలు ప్రశ్నాపత్రాన్ని పరిశీలించి వివరణాత్మక ప్రతిస్పందనలను అందించాలని ఆయన కోరారు.  అన్ని రాష్ట్రాల సమష్టి సంకల్పాన్ని ప్రతిబింబించే పత్రాన్ని రూపొందించడంలో, దేశ సమాఖ్య పునాదులను బలోపేతం చేయడంలో క్రియాశీల భాగస్వామ్యం అమూల్యమైనదని స్టాలిన్ అన్నారు. అటువంటి ప్రయత్నం రాజకీయాలు, పక్షపాతానికి అతీతంగా ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి తెలిపారు. అంతా కలిసి, మన రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని పునరుద్ధరించుకుందామని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు బలమైన, న్యాయమైన, సమాఖ్యమైన ఐక్యతను అందిద్దామని చెప్పారు.   అయితే దేశంలోని సంకీర్ణ పార్టీలు పాలించే రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం దిల్లీలో శుక్రవారం జరిగింది. తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాల గోపాల్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. అదే సయమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రధాన రాజకీయ పార్టీ నాయకులకు రాసిన లేఖ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos