న్యూఢిల్లీ : బీహార్‌లో విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై ఓటర్లను చేర్చడం, తొలగించడం కోసం ఇప్పటి వరకూ వ్యక్తుల నుంచి 1.95 లక్షల ఫిర్యాదుల వచ్చాయని, వీటిలో 25 వేల ఫిర్యాదులను పరిష్కరించామని ఎన్నికల కమిషన్ తెలిపింది. 1.95 లక్షల ఫిర్యాదుల్లో ఎన్ని ఫిర్యాదులు ఓటర్లను చేర్చడం కోసం వచ్చాయి, ఎన్ని ఫిర్యాదులు తొలగించడంపై వచ్చాయనే వివరాలను ఇసి వెల్లడించలేదు. గురువారం ఇసి తెలిపిన వివరాల ప్రకారం సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ 79, ఆర్జెడి మూడు ఫిర్యాదులు దాఖలు చేశాయి. ఫిర్యాదులు దాఖలుకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా బిజెపి, కాంగ్రెస్ సహా ఏ జాతీయ పార్టీ ఇప్పటి వరకూ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఆరోపణలు చేయలేదు. వివిధ కారణాలతో ముసాయిదా జాబితా నుంచి తొలగించిన 60 లక్షలకు పైగా ఓటర్ల పేర్లతో పోలిస్తే వచ్చిన 1.95 లక్షల ఫిర్యాదులు చాలా స్వల్పమని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.11 శాతం మంది ఇప్పటికే అవసరమైన పత్రాలను సమర్పించారని తెలిపారు. బీహార్‌లో ఎస్ఐఆర్లో భాగంగా ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఓటర్ల జాబితాలో చేర్చాలనే కోరుకునే వ్యక్తుల నుంచి ఎన్నికల కమిషన్ అడిగిన 11 పత్రాలు లేదా ఆధార్‌ను అంగీకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు