సిమ్లా:హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మేఘాలు బద్ధలు కావటం, ఆకస్మిక వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఏడాది జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కలిపి రూ.2,62,336.38 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది.రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వివరాల ప్రకారం.. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి అంటే జూన్ 20 నుంచి ఆగస్టు 27 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 310కి చేరింది. అందులో వర్షం కారణంగా సంభవించిన ప్రమాదాలు.. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బరస్ట్‌లు, ఇళ్లు కూలిపోవడం, నీటిలో మునిగిపోవడం, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాల కారణంగా 158 మంది మరణించగా.. రోడ్డు ప్రమాదాల్లో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 369 మంది గాయపడ్డారు. 38 మంది గల్లంతయ్యారు.ఈ వర్షాలకు మండి జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. అక్కడ 51 మంది మరణించారు. అందులో 29 మరణాలు వర్ష సంబంధించినవి కాగా, 22 రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించినవి. ఇక కాంగ్రాలో 49, చంబాలో 36, సిమ్లాలో 28 మరణాలు నమోదయ్యాయి. ఈ వర్షాలకు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్, నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కలిపి మొత్తం రూ.2,62,336.38 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం.. బుధవారం సాయంత్రం నాటికి రెండు జాతీయ రహదారులు సహా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 582 రోడ్లు బ్లాక్ అయ్యాయి. కులు, మండి, కాంగ్రా, సిమ్లా జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కులు జిల్లాలో మాత్రమే NH-03, NH-305లను అధికారులు మూసివేశారు. 1,155 విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 346 నీటి సరఫరా పథకాలు పనిచయడం లేదు.