ఆరెస్సెస్ గీతం వివాదం… క్షమాపణ చెప్పిన డీకే శివకుమార్

ఆరెస్సెస్ గీతం వివాదం… క్షమాపణ చెప్పిన డీకే శివకుమార్

బెంగళూరు:కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ శాసనసభలో ఆరెస్సెస్ గీతం ఆలపించిన వివాదంపై క్షమాపణలు తెలిపారు. బీజేపీ నేతలను ఉద్దేశించి సరదాగా అలా చేశానని, తన ఉద్దేశం ఆర్ఎస్ఎస్‌ను కీర్తించడం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన వల్ల కాంగ్రెస్ పార్టీలో గానీ, ఇండియా కూటమిలో గానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని మంగళవారం బెంగళూరులో మీడియా సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు. గత వారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో, ఆర్‌సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటపై ప్రతిపక్ష బీజేపీ చర్చను లేవనెత్తినప్పుడు డీకే శివకుమార్ ఆరెస్సెస్ ప్రార్థనా గీతమైన ‘నమస్తే సదా వత్సలే మాతృభూమే’లోని కొన్ని పంక్తులను ఆలపించారు. ఇది వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది” అని ఆయన అన్నారు.క్షమాపణ చెప్పాలని పార్టీ అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, స్వయంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తాను 1980 నుంచి కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నానని పునరుద్ఘాటించారు. “నేను కాంగ్రెస్ కార్యకర్తగా జన్మించాను. కాంగ్రెస్ కార్యకర్తగానే మరణిస్తాను. నా నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. గాంధీ కుటుంబమే నాకు ఆరాధ్య దైవం” అని ఆయన అన్నారు.ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ ఆరోపణల కేసులో తాను ఢిల్లీలోని తిహార్ జైలులో గడిపిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. “నా నిబద్ధత, నా సిద్ధాంతం గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే నా గతాన్ని పరిశీలించవచ్చు. దీనిని అడ్డం పెట్టుకుని ఎవరైనా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అది వారి వ్యక్తిగత విషయం. నేను దానిపై స్పందించను” అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందే ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్, గాంధీ కుటుంబం చరిత్రతో పాటు ఆరెస్సెస్, బీజేపీ, జేడీ(ఎస్), కమ్యూనిస్టు పార్టీల గురించి కూడా అధ్యయనం చేశానని ఆయన తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos