విశాఖ పట్టణం: ఇక్కడి ఉక్కు పరిశ్రమలోఉత్పత్తి పూర్వస్థితికి చేరుకుంది. 22వ తేదీ శుక్రవారం బ్లాస్ట్ ఫర్నెస్-1లో 1433, ఫర్నెస్-2లో 1187, ఫర్నెస్-3లో 3540 టన్నులు మాత్రమే ఉత్పత్తి కాగా శనివారం కేవలం ఫర్నెస్-1 లో 5198 టన్నులు ఉత్పత్తి అయ్యిందని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ఫర్నెస్ 2, 3లో జీరో ఉత్పత్తి నమోదు అయ్యింది. ఆదివారం లైమ్‌స్టోన్ అందుబాటులోకి రావడంతో తిరిగి ఫర్నెస్‌లు వినియోగంలోకి తీసుకు వచ్చినట్టు సిబ్బంది తెలిపారు. అయితే లోడ్ అయిన 7 గంటల తరువాత మాత్రమే ఉత్పత్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆదివారమూ ఉత్పత్తి లేనట్టేనని తెలుస్తోంది.మూడు రోజులుగా ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం లైమ్‌స్టోన్ లేకపోవడమే. లైమ్‌స్టోన్ గంగవరం పోర్టుకు వచ్చి ఉన్నా దానిని ఉక్కు కర్మాగారంలోకి తరలించేందుకు అవసరమైన రైల్వే ర్యాక్స్ లేని కారణంగా రవాణా జరగలేదు. దీంతో రెండు ఫర్నెస్‌లు నిలిపివేయవలసి వచ్చింది. గత మూడు రోజులుగా ఫర్నెస్‌లలో ఉత్పత్తి లేకపోయినా దానిపై దృష్టిసారించని ఉన్నత యాజమాన్యం కేవలం ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ఇచ్చే విషయంలో అర్ధరాత్రి వరకూ తలమునకలై ఉందని విమర్శలు వచ్చాయి. 412 మంది వి.ఆర్.ఎస్. దరఖాస్తులను అంగీకరిస్తూ శనివారం రాత్రి ఉద్యోగులకు వ్యక్తిగతంగా లేఖలు పంపారు.తాత్కాలిక సీఎండీ అప్పుడప్పుడు వచ్చి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఇచ్చిన స్క్రిప్ట్ అమలు ఏ మేరకు అవుతుందో చూసుకొని వెళ్లిపోవడంతోనే సరిపోతుందని, కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం మిగతావారికి లేకపోవడంతో కర్మాగారం పాలన అస్తవ్యస్తంగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రయివేటీకరణ చేయనివ్వబోమని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు ఇప్పటికే ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి ఉక్కును రక్షించాలని ఉత్తరాంధ్ర ప్రజలు, ఉక్కు ఉద్యోగులు, ప్రజాసంఘాలు కోరుకుంటున్నాయి. మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ తన వ్యయభారాన్ని తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పార్లమెంటు స్థాయీ సంఘానికి కేంద్ర ఉక్కుశాఖ తెలిపింది. ఏటా పెరిగిపోతున్న నష్టాలతోపాటు, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి ముడిసరకు ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తూ బీజేపీ సీనియర్ ఎంపీ అనురాగ్‌సింగ్ ఠాకుర్ నేతృత్వంలోని బొగ్గు, గనులు, ఉక్కు వ్యవహారాల స్థాయీసంఘం గత ఏడాది డిసెంబరు 4న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ సిఫార్సుల అమలు కోసం తీసుకున్న చర్యల గురించి తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దానికి అనుగుణంగా కేంద్ర ఉక్కుశాఖ అందజేసిన నివేదికను స్థాయీ సంఘం ఇటీవల పార్లమెంటుకు సమర్పించింది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గుభారాన్ని విశాఖ స్టీల్‌ప్లాంట్ క్రమంగా తగ్గించుకుంటున్న విషయాన్ని స్థాయీసంఘానికి కేంద్ర ఉక్కుశాఖ నివేదించింది. ‘రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆస్ట్రేలియా కోకింగ్ కోల్‌పై ఆధారపడడం తగ్గించుకొని, అమెరికా, ఇండోనేషియా, మొజాంబిక్, రష్యా వంటి దేశాల వైపు మళ్లుతోంది. దానివల్ల ఆస్ట్రేలియా బొగ్గు వినియోగం 2020-21 నుంచి 2024 నవంబరు మధ్యకాలంలో 78% నుంచి 49%కి పడిపోయింది. దీంతోపాటు 2022-23 నుంచి 2024-25 మధ్యకాలంలో ఖరీదైన హార్డ్ కోకింగ్‌కోల్‌ను ఇతర బొగ్గుతో కలిపే నిష్పత్తిని 63% నుంచి 54%కి తగ్గించింది. 2023-24లో చాలా పోటీధరల్లో రష్యా నుంచి 0.55 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంది.రష్యా సరఫరాదారులతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు చేసుకొంది. స్థిరమైన ధరలతో సుస్థిరంగా బొగ్గు సరఫరా చేసే ఇతర సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకొంది. ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల నుంచి తక్కువ ధరలతో వనరులను దిగుమతి చేసుకోవడానికి నిరంతరం గ్లోబల్ టెండర్లు జారీచేయాలని ఈ సంస్థ నిర్ణయించింది. విదేశీ కోకింగ్‌కోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం 5-8% వరకు దేశీయ బొగ్గును కలిపి వాడుతోంది. దీన్ని 12% వరకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకొంది’ అని కేంద్ర ప్రభుత్వం స్థాయీ సంఘానికి తెలిపింది.ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది : కేంద్రప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత సంస్థలో 2024 అక్టోబరు 28 నుంచి రెండో బ్లాస్ట్‌ఫర్నేస్ మొదలుపెట్టినట్లు స్థాయీసంఘానికి కేంద్రం సమాచారం అందించింది. సంస్థ నిర్వహణ సామర్థ్యం 2024 సెప్టెంబరు నుంచి 2025 ఫిబ్రవరి మధ్యకాలంలో పెరిగినట్లు వివరించింది.