న్యూ ఢిల్లీ: ప్రస్తుతం మన దేశంలోని 30 మంది సిట్టింగ్ ముఖ్యమంత్రుల్లో 12 మంది లేదా 40 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రసీ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన తాజా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మన దేశంలోనే అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. ఆ తరువాత తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌పై 47 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 19 కేసులు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్యపై 13 కేసులు, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై 5 కేసులు ఉన్నాయి. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్‌లపై చెరో నాలుగేసి కేసులు ఉన్నాయి. కేరళ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్‌పై 2, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌పై ఒక క్రిమినల్ కేసు ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో కొత్తగా 3 బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో తీవ్ర నేరారోపణలపై 30 రోజుల పాటు అరెస్ట్ అయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించే నిబంధనలను చేర్చారు. అయితే దీనిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఏడీఆర్ రిపోర్ట్ మన దేశంలో 40 శాతం మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పడం గమనార్హం. ఏడీఆర్ నివేదిక ప్రకారం, దేశంలోని 10 మంది లేదా 33 శాతం మంది ముఖ్యమంత్రులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు. వాటిలో హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన కేసులు ఉండడం గమనార్హం.రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రస్తుత 30 మంది సిట్టింగ్ ముఖ్యమంత్రులు, గత ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఎలక్షన్ కమిషన్ ముందు దాఖలు చేసిన స్వీయ ధ్రువీకరణ అఫిడవిట్లను పూర్తిగా విశ్లేషించి ఈ రిపోర్ట్‌ను రూపొందించినట్లు ఏడీఆర్ తెలిపింది.