ముంబై: మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో రెండు వర్గాల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకున్నది. సిద్ధార్థనగర్‌లో ఈ ఘటన జరిగింది. రెండు గ్రూపులు తగాదాకు దిగాయి. ఆ తర్వాత రాళ్లు రువ్వుకున్నారు. విధ్వంసం సృష్టించారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఘర్షణల్లో 10 మంది గాయపడ్డారు. రాజ్భాగేశ్వర్ ఫుట్‌బాల్ క్లబ్ 31 ఏళ్ల సంబరాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసింది. ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. దీని పట్ల స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అయితే ఆ సమయంలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. రాత్రి 10 గంటల సమయంలో రెండు గ్రూపులు రాళ్లు రువ్వుకున్నాయి. రెండు కార్లకు నిప్పుపెట్టారు. కార్లు, ఆటోలను ధ్వంసం చేశారు. రాళ్ల దాడిలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుమారు 200 మందిని మోహరించారు. రెండు గ్రూపుల మధ్య తప్పుడు అవగాహనతో ఘర్షణ జరిగినట్లు భావిస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోల్హాపూర్ ఎస్పీ కోరారు.