పాట్నా : బీహార్ మాజీ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్‌పై మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ బీహార్‌లోని గయా పర్యటనకు ముందు తేజస్వి యాదవ్ ఎక్స్‌లో అభ్యంతరకరమైన పోస్టు చేశారు. మోడీపై చేసిన అభ్యంతరకర పోస్టుపై గడ్చిరోలి బిజెపి ఎమ్మెల్యే మిలింద్ నరోటే ఫిర్యాదు చేసినట్లు సీనియార్ పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196 (వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, 356 (పరువు నష్టం), 352 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 353 (ప్రజలకు హాని కలిగించే ప్రకటనలు చేయడం) వంటి సెక్షన్ల కింద తేజస్వియాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ సందర్భంగా తాను ఎఫ్ఐఆర్లకు భయపడను అని తేజస్వియాదవ్ అన్నారు. కేసు నమోదవ్వడంపై మీడియా ప్రతనిధులు తేజస్వియాదవ్‌ని ప్రశ్నించగా.. ‘ఎఫ్ఐఆర్కి ఎవరు భయపడతారు? జుమ్లా అనే పదం చెప్పడం కూడా నేరంగా మారింది. బిజెపి నేతలు సత్యానికి భయపడతారు. మేము ఏ ఎఫ్ఐఆర్కి భయపడము. మేము నిజమే మాట్లాడతాము’ అని ధీటుగా బదులిచ్చారు.