రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: యడ్యూరప్ప

రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: యడ్యూరప్ప

బెంగళూరు: భాజపా కర్ణాటక అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప మధ్యవర్తుల ద్వారా జేడీఎస్‌ ఎమ్మెల్యేకు డబ్బు ఎర వేస్తున్నట్లుగా ఉన్న ఆడియో టేపును కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం విడుదల చేశారు. కాగా ఈ టేపుపై యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా అబద్ధమని, తనను ఇరికించాలని కావాలనే ఈ వీడియోను సృష్టించారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.‘జేడీఎస్‌ ఎమ్మెల్యే నాగన గౌడకు డబ్బు ఎరవేసేందుకు ప్రయత్నించానని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం. ఇందుకోసం నేను ఎవర్నీ కలవలేదు. ఆలయ దర్శనం కోసం ఇటీవల నేను దేవదుర్గ వెళ్లాను. వెంటనే తిరిగొచ్చాను. కానీ అక్కడ నాగన గౌడ కుమారుడు శరణ్‌ గౌడ నన్ను కలిసినట్లు, నాతో మాట్లాడినట్లు రికార్డు చేశారు. అదంతా అబద్ధం. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుమారస్వామి ఈ డ్రామా ఆడుతున్నారు. కుమారస్వామి ఓ నిర్మాత కదా. వాయిస్‌ రికార్డింగ్‌లో ఆయనకు మంచి నైపుణ్యం ఉంది. అలాగే ఈ వీడియోను సృష్టించారు’ అని యడ్యూరప్ప దుయ్యబట్టారు.అసెంబ్లీ స్పీకర్‌కు కూడా డబ్బు ఆశజూపానని ఆరోపిస్తున్నారని, అది కూడా అబద్ధమేనని ఆయన అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేయడమేగాక.. రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని కుమారస్వామి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos