ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. గురువారం ఆరు పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని, దీంతో పోలీసులు, ఇతర అత్యవసర సంస్థలు గాలింపు చర్యలు ప్రారంభించాయని ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి ఒకరు తెలిపారు. రాజధానిలోని ఆరు పాఠశాలల్లో ఉదయం 6.35 నుండి 7.48 గంటల మధ్య బాంబు బెదిరింపులకు సంబంధించిన కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిలో ప్రసాద్ నగర్‌లోని ఆంధ్రా స్కూల్, బిజిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, రావు మాన్ సింగ్ స్కూల్, కాన్వెంట్ స్కూల్, మాక్స్ ఫోర్ట్ స్కూల్ మరియు ద్వారకలోని ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాటు పోలీసు బృందాలు వెంటనే ఆయా పాఠశాలలకు చేరుకున్నాయి. నాలుగు రోజుల్లో పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది మూడవసారి. సోమవారం ఢిల్లీ అంతటా 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. అవి నకిలీవని తేలింది. బుధవారం దేశ రాజధానిలోని దాదాపు 50 పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. తరువాత వాటిని ‘బూటకపు బెదిరింపు’గా ప్రకటించారు.