ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ యువకుడు దాడి చేశాడు. బుధ వారం ఉదయం సివిల్ లైన్స్‌లోని సిఎం అధికారిక నివాసంలో జరిగిన “జన్ సున్వై” కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) వర్గాలు తెలిపాయి. నిందితుడిని సంఘటనా స్థలం నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. నిందితుడు మొదట ముఖ్యమంత్రికి ఫిర్యాదుగా ఒక పత్రాన్ని అందజేసి, ఆపై ఆమెపై దాడి చేసినట్లు బిజెపి నాయకుడు ఒకరు తెలిపారు. సిఎం రేఖ గుప్తాపై జరిగిన దాడిని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ కూడా ఈ దాడిని ఖండించారు. ఈ సంఘటనను “దురదృష్టకరం” అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి మొత్తం ఢిల్లీకి నాయకత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ సిఎం భద్రతను కూడా యాదవ్ ప్రశ్నించారు. ఈ సంఘటన మహిళల భద్రతను కూడా బహిర్గతం చేస్తుంది. ఢిల్లీ సిఎం సురక్షితంగా లేకపోతే, ఒక సామాన్యుడు లేదా సాధారణ మహిళ ఎలా సురక్షితంగా ఉంటారు?” అని దేవేందర్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు అతిషి బుధవారం ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడిని ఖండించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని అతిషి అన్నారు. “ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడి అత్యంత ఖండించదగినది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, నిరసనలకు చోటు ఉంటుంది. కానీ హింసకు చోటు లేదు. నిందితులపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. ముఖ్యమంత్రి పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాము” అని ఆమె పేర్కొన్నారు.